Srikanth Chary Death Anniversary | డిసెంబర్ 3 అంటే ఇతరులకు సాధారణమైన రోజు కావొచ్చు. కానీ తెలంగాణ ప్రజలకు మాత్రం అమరుడు శ్రీకాంత చారి యాదికొస్తాడు.
తన శరీరం అగ్నికి ఆహుతవుతున్నా ఏమాత్రం చలించకుండా జై తెలంగాణ నినాదంతో నాలుగు కోట్ల మందిలో ఉద్యమ జ్వాలను రగిల్చాడు.
అది 2009 నవంబర్. నాటి తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉధృతంగా ఉద్యమం సాగుతున్న రోజులు. మరోవైపు ఇదే సమయంలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రమే తన ద్యేయంగా మార్చుకున్న శ్రీకాంత చారి ప్రత్యేక రాష్ట్రం కోసం వేచి చూసి చూసి నీరసించారు.
కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో తన చావైనా మొండి పాలకుల్లో చలనం తెప్పిస్తుందని భావించాడు. దింతో నవంబర్ 29న ఎల్బీ నగర్ చౌరస్తా వద్ద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు.
ఆ మంట తన శరీరాన్ని దహించివేస్తున్నా నోటివెంట జై తెలంగాణ నినాదం మాత్రం మూగబోలేదు. కాలిన గాయాలతో మృత్యువుతో పోరాడి డిసెంబర్ 3 రాత్రి 10 గంటల ముప్పై నిమిషాలకు ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఊపిరి ఆపేశాడు.
శ్రీకాంత చారి అమరత్వాన్ని చూసిన యావత్ తెలగాణ చలించిపోయింది. ఇలా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తాను ఆహుతై..ఉద్యమానికి వేగుచుక్కయ్యాడు.