SC bench asks petitioner to use ‘Arattai’ after getting blocked from WhatsApp | కమ్యూనికేషన్ కోసం కేవలం వాట్సపే కాకుండా స్వదేశీ యాప్ ‘అరట్టై’ కూడా ఉందని మేక్ ఇన్ ఇండియాలో భాగంగా దీనిని వినియోగించాలని ఒక పిటిషనర్ కు సూచించింది సర్వోన్నత న్యాయస్థానం.
కాగా వాట్సప్ సంస్థ తన అకౌంట్ ను ఉన్నట్టుండి బ్లాక్ చేసిందని, దాన్ని పునరుద్ధరించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని అలాగే సోషల్ మీడియా యాపులు ఉన్నపళంగా ఖాతాలను బ్లాక్ లేదా నిషేధించకుండా మార్గదర్శకాలు జారీ చేయాలని ఓ వ్యక్తి ఆర్టికల్ 32 కింద సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్ నాథ్ మరియు జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ ఒకింత అసహనం వ్యక్తం చేసింది.
ఆర్టికల్ 32 కింద పిటిషన్ ఈ రకంగా ఫైల్ చేశారని, ఇది ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం అడిగింది. ‘పిటిషనర్ డయాగ్నిక్ సెంటర్ లో పని చేస్తున్నారు. గత 12 ఏళ్లుగా క్లయింట్లతో వాట్సప్ ద్వార టచ్ లో ఉన్నారు. ఉన్నపళంగా అకౌంట్ బ్లాక్ అవ్వడంతో పిటిషనర్ సమస్యను ఎదురుకుంటున్నారు’ అని న్యాయవాది బదులిచ్చారు.
ఈ నేపథ్యంలో ‘కమ్యూనికేషన్ కోసం వాట్సపే ఎందుకు. ఇతర యాపులు కూడా ఉన్నాయి. ఇటీవలే స్వదేశీ యాప్ అరట్టై కూడా వచ్చింది. మేక్ ఇన్ ఇండియా లో భాగంగా దీనిని ఉపయోగించండి’ అని న్యాయస్థానం పేర్కొంది. అనంతరం పిటిషన్ ను తిరస్కరించింది. కాగా అరట్టై ఇటీవల తెగ వైరల్ గా మారింది. అత్యధిక భారతీయ నెటిజన్లు ఈ యాపును డౌన్లోడ్ చేసుకుంటున్నారు.









