SC administration asks Centre to take back official CJI residence occupied by DY Chandrachud | సర్వోన్నత న్యాయస్థాన మాజీ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు సంబంధించిన అధికారిక నివాసం ఖాళీ చేయించే విషయంలో ఒక అసాధారణ పరిణామం చోటుచేసుకుంది.
ఢిల్లీలోని కృష్ణా మీనన్ మార్గ్‌లో ఉన్న 5వ నంబర్ బంగ్లా, సాధారణంగా ప్రధాన న్యాయమూర్తికి కేటాయించబడుతుంది. జస్టిస్ చంద్రచూడ్ 2024 నవంబర్‌లో పదవీ విరమణ చేసినప్పటికీ, నిబంధనల ప్రకారం ఆరు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా ఈ బంగ్లాను ఖాళీ చేయలేదు.
నిబంధనల ప్రకారం, పదవీ విరమణ తర్వాత ఆరు నెలల గడువులోగా బంగ్లా ఖాళీ చేయాల్సి ఉండగా, ప్రత్యేక అనుమతితో ఈ గడువు మే 31 వరకు పొడిగించబడింది. అయినప్పటికీ, జస్టిస్ చంద్రచూడ్ బంగ్లాను ఖాళీ చేయకపోవడంతో, సుప్రీం కోర్టు యంత్రాంగం తాజగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ రాసింది.
ఈ లేఖలో, “జస్టిస్ చంద్రచూడ్ నుంచి బంగ్లాను తక్షణమే స్వాధీనం చేసుకోండి. ఆయనకు ఇచ్చిన అనుమతి గడువు ముగిసింది” అని పేర్కొంది. ఈ వివాదంపై జస్టిస్ చంద్రచూడ్ స్పందిస్తూ, తన ఇద్దరు కుమార్తెలకు ప్రత్యేక అవసరాలు ఉన్నందున, వ్యక్తిగత కారణాల వల్ల బంగ్లా ఖాళీ చేయడంలో ఆలస్యం జరిగిందని వివరించారు.
ఈ విషయాన్ని సుప్రీం కోర్టు యంత్రాంగానికి తెలియజేసినట్లు చెప్పారు. తుగ్లగ్ రోడ్డులోని బంగ్లా నంబర్ 14ను ప్రభుత్వం తనకు ప్రత్యన్మయంగా కేటాయించిందని, అయితే అందులో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అందుకే అందులోకి మారలేదని వివరించారు.
అతి త్వరలో బంగ్లాను ఖాళీ చేసి అధికారులకు అప్పగిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా చంద్రచూడ్ పదవీ విరమణ తర్వాత కూడా అధికారిక నివాసంలోనే ఉండడంతో ఆయన తర్వాత సీజేఐ గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ ఇద్దరూ అధికారిక నివాసంలోకి మారలేదు.