Saif Ali Khan News | బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ పై ఓ దుండగుడు కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ముంబైలోని నటుడి నివాసంలోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించాడు.
ఇది గమనించిన సైఫ్ అలీఖాన్ అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో దుండగుడు నటుడిపై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. ఈ ఘర్షణలో నటుడికి ఆరు చోట్ల కత్తి గాయాలయ్యాయి.
వెంటనే సైఫ్ అలీ ఖాన్ ను కుటుంబ సభ్యులు లీలావతి ఆసుపత్రికి తరలించారు. రెండు చోట్ల లోతైన గాయాలు అయినట్లు వైద్యులు గుర్తించారు. ఈ ఘటన గురువారం తెల్లవారుజామున రెండున్నర గంటలకు జరిగినట్లు తెలుస్తోంది.
సమాచారం అందుకున్న పోలీసులు నటుడి నివాసానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దుండగుడిని పట్టుకునేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు.