Rohit Sharma Latest | టీం ఇండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మను ఉద్దేశించి రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ తెగ వైరల్ గా మారింది. ‘శర్మజీ కా బేటా ఝుకేగా నహీ’ అని తెలుగులో పోస్ట్ చేయడం ఆసక్తిగా మారింది. ‘అవును నా మాతృభాష తెలుగు. మా అమ్మ స్వస్థలం విశాఖపట్నం’ అంటూ గతంలో రోహిత్ శర్మ చేసిన పోస్టును గుర్తుచేసింది.
శనివారం విశాఖ వేదికగా సౌత్ ఆఫ్రికాతో జరిగిన మూడవ వన్డేలో టీం ఇండియా ఘన విజయం సాధించిన విషయం తెల్సిందే. సౌత్ ఆఫ్రికా నిర్దేశించిన 271 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 40 ఓవర్ల లోపే ఛేదించింది టీం ఇండియా. యశస్వి జైస్వాల్ సెంచరీతో చెలరేగగా, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 65 పరుగులతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడారు.
ఇకపోతే హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 75 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ క్రమంలో విశాఖ స్టేడియంలో ఆయన మూడవ హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ‘నా మాతృభాష తెలుగు, మా అమ్మ స్వస్థలం విశాఖ’ అంటూ రోహిత్ శర్మ చేసిన పోస్టును రీపోస్ట్ చేసిన రాజస్థాన్ రాయల్స్ శర్మజీ కా బేటా ఝుకేగా నహీ అంటూ తెలుగులో పోస్ట్ చేసింది. ఇది కాస్తా క్షణాల వ్యవధిలోనే తెగ వైరల్ గా మారింది.









