RJD’s Madan Shah Cries Outside Lalu Yadav’s House Over Poll Ticket Denial | బీహార్ శాసనసభ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇదే సమయంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడి చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటిముందు హైడ్రామా నెలకొంది.
ఆ పార్టీ సీనియర్ నాయకుడు మదన్ షా, లాలూ ఇంటి ముందు నిరసనకు దిగారు. బట్టలు చింపుకుని, ఇంటి ముందే ఏడుస్తూ నేలపై కుప్పకులారు. తన టికెట్ ను రూ 2.7 కోట్లకు వేరే అభ్యర్థికి అమ్మేసుకున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
‘లాలూ తనకు టికెట్ ఇస్తానని మాటిచ్చారు. అనంతరం టికెట్ కావాలంటే రూ.2.7 కోట్లు ఇవ్వాలని సంజయ్ యాదవ్ డిమాండ్ చేశాడు. నేను ఇవ్వలేనని స్పష్టం చేశా. నేను పేదవాడిని. 1990ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. కానీ డబ్బులు ఇవ్వలేదని నాకు టికెట్ ఇవ్వలేదు. నా స్థానంలో సంతోష్ కుష్వాహ అనే వ్యక్తికి ఇచ్చారు. అతడో బీజేపీ ఏజెంట్’ అంటూ మదన్ షా సంచలన ఆరోపణలు చేశారు.
ఇదే సమయంలో లాలూ తన కారులో ఇంటిలోపలకి వెళ్లారు. ఇది గమనించిన మదన్ షా లాలూ కారు వెనుకాల పరుగెత్తారు. కానీ సిబ్బంది ఆయన్ను అడ్డుకున్నారు. లాలూ కుమారుడు, ఆర్జేడీ ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ కు అహంకారం ఎక్కువని, ఆయన ఎవరిని కలవరని ఆ తర్వాత మదన్ షా మీడియాతో చెబుతూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్జేడీ ఓడిపోతుందని దుమ్మెత్తిపోశారు.










