Revanth Reddy Launches Indiramma Saree Distribution Scheme | దివంగత ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ‘ఇందిరమ్మ చీరల పథకం’ ను ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బుధవారం నక్లెస్ రోడ్డు జంక్షన్ వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా పలువురు మహిళలకు ముఖ్యమంత్రి చీరలు పంపిణీ చేశారు.
సిరిసిల్ల చేనేత కార్మికుల చేత నేయించిన కోటి నాణ్యమైన చీరలను రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలకు “ఇందిరమ్మ చీరల పథకం” కింద పంపిణీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. చీరల ఉత్పత్తి బాధ్యత సిరిసిల్ల నేత కార్మికులకు అప్పగించినట్లు తెలిపారు. భారీ ఎత్తున ఉత్పత్తికి సమయం పట్టే అవకాశం ఉన్నందున రెండు దశల్లో పంపిణీ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
మొదటి విడతగా ఇందిరాగాంధీ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని నవంబర్ 19 నుంచి పథకం ప్రారంభం అవుతుందని తొలుత గ్రామీణ మహిళలకు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ తల్లి ఆవిష్కరణ దినోత్సవమైన డిసెంబర్ 9 నాటికి అర్హులైన ప్రతి గ్రామీణ మహిళకు ఈ పథకం కింద చీరను అందజేయనున్నట్లు చెప్పారు. ఇక పట్టణ ప్రాంత మహిళల కోసం మార్చి 1, 2026 నాడు మలి విడత పంపిణీ ప్రారంభించి… అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8 నాటికి పంపిణీ పూర్తి అవుతుందని సీఎం స్పష్టం చేశారు.









