Sunday 8th September 2024
12:07:03 PM
Home > బిజినెస్ > పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు

పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ వ్యాఖ్యలు

RBI Governor Shaktikanta Das' comments during the policy review

ముంబై: ధరల్ని అదుపు చేయడమే తమ ప్రాధాన్యం అయినందున, ఇప్పట్లో వడ్డీ రేట్లు తగ్గించే యోచన లేదని రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ కుండబద్దలు కొట్టారు. శుక్రవారం ఆర్బీఐ పాలసీ సమీక్ష ముగిసిన అనంతరం గవర్నర్‌ మీడియాతో మాట్లాడుతూ కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణం గణాంకాలు సంతృప్తికరంగా ఉన్నాయని, అక్టోబర్‌లో ఇది 4.87 శాతానికి దిగివచ్చినంత మాత్రాన రేట్ల తగ్గింపునకు ఏ మాత్రం తొందరపడేది లేదంటూ పరోక్ష సంకేతాలు ఇచ్చారు. ద్రవ్యోల్బణం నిర్వహణలో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని దాస్‌ చెప్పారు. ఆర్థిక వ్యవస్థకు ఏదో ఒక షాక్‌ తగిలే అవకాశం ఉన్నందున ఆర్బీఐ భవిష్యత్‌ పాలసీ ఎలా ఉంటుందన్న అంచనాల్ని వెల్లడించడం కష్టసాధ్యమని, భవిష్యత్‌ ‘చాలా అనిశ్చితం’గా ఉందని వ్యాఖ్యానించారు.
ఐదోసారీ కీలక రేట్లు యథాతథం
బ్యాంక్‌ల వడ్డీ రేట్లను ప్రభావితం చేసే కీలక రేట్లను ఆర్బీఐ యథాతథంగా అట్టిపెట్టింది. ద్రవ్యోల్బణంపై నెలకొన్న అనిశ్చితి, వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మూడురోజుల పాటు ద్రవ్య విధాన సమీక్షను నిర్వహించిన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) రెపో రేటును 6.5 శాతం వద్దే అట్టిపెట్టాలని నిర్ణయించింది. ఎస్‌డీఎఫ్‌ రేటు 6.25 శాతం వద్ద, ఎంఎస్‌ఎఫ్‌ రేటు 6.75 శాతం వద్దే కొనసాగించనున్నట్టు కమిటీ నిర్ణయాల్ని గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ వెల్లడించారు. అధిక వడ్డీ రేట్లు ఎక్కువకాలం ఉంటాయనడానికి సంకేతంగా ‘అకామిడేటివ్‌ స్టాన్స్‌’ను ఉపసంహరించేందుకు మెజారిటీ కమిటీ సభ్యులు ఓటు చేశారు. ఆరుగురు సభ్యులు గల కమిటీలో ముగ్గురు ఆర్బీఐ అధికారులు కాగా, మరో ముగ్గురు కేంద్ర ఆర్థిక శాఖ నియమించిన నిపుణులు ఉంటారు. రేటు రేటును 2022 మే నుంచి వరుసగా 250 బేసిస్‌ పాయింట్లు (2.5 శాతం) పెంచిన ఆర్బీఐ ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి యథాతథ స్థితిని కొనసాగిస్తున్నది.

జీడీపీ వృద్ధి అంచనా పెంపు
పూర్తి ఆర్థిక సంవత్సరానికి భారత్‌ జీడీపీ వృద్ధి అంచనాల్ని ఆర్బీఐ పెంచింది. గత సమీక్షలో 6.5 శాతం వృద్ధిని అంచనావేయగా, తాజాగా దీనిని 7 శాతానికి పెంచింది. జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ అంచనాల్ని మించి 7.6 శాతం వృద్ధిచెందిన సంగతి తెలిసిందే. వృద్ధి జోరుగా ఉన్నదని, అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నదని శక్తికాంత్‌దాస్‌ వ్యాఖ్యానించారు. తయారీ పీఎంఐ విస్తరించడం, ఎనిమిది కీలక రంగాలు ఆరోగ్యకరంగా వృద్ధి చెందడం ప్రోత్సాహక సంకేతాలని అన్నారు. ప్రస్తుతం భారత ఆర్థిక వ్యవస్థ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు, రెగ్యులేటర్లకు విశ్వాసం పెరుగుతున్నదని వెల్లడించారు.

ద్రవ్యోల్బణం అంచనా 5.4 శాతం
జీడీపీ వృద్ధి అంచనాల్ని పెంచిన ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉంటుందని అంచనా వేసింది. ఇటీవల కమోడిటీ ద్రవ్యోల్బణం తగ్గినందున అక్టోబర్‌లో 4.7 శాతానికి దిగివచ్చినప్పటికీ, ఆహార ద్రవ్యోల్బణం రిస్క్‌లు పొంచివున్నాయని, నవంబర్‌, డిసెంబర్‌లో ఇది పెరగవచ్చని భావిస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్‌ చెప్పారు. అనిశ్చిత ఆహారోత్పత్తుల ధరలు, అంతర్జాతీయంగా చక్కెర ధరలు పెరగడం ఆందోళనకరమని అన్నారు. ధరలపై మరో రౌండు ప్రభావం ఏమైనా ఉంటుందా అనే అంశాన్ని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉందని, ఈ కారణంగానే వినిమయ ద్రవ్యోల్బణం గత అంచనాల్నే కొనసాగిస్తున్నామన్నారు.

Rbi

ఎవరేమన్నారు..
ఆర్బీఐ నిర్ణయాలు బ్యాంకింగ్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపర్చేలా ఉన్నాయి. ముఖ్యంగా ఎడ్యుకేషన్‌, హెల్త్‌కేర్‌ కోసం యూపీఐ లావాదేవీలకున్న పరిమితిని పెంచడాన్ని స్వాగతిస్తున్నాం. వృద్ధిరేటు పెరుగవచ్చన్న అంచనా.. రాబోయే కొత్త సంవత్సరానికి శుభ సంకేతం.

-దినేశ్‌ ఖారా, ఎస్బీఐ చైర్మన్‌

రెపోరేటును ఈసారీ యథాతథంగానే ఉంచాలని నిర్ణయించడం సంతోషకరం. ద్రవ్యసమీక్షలో ఆర్బీఐ నిర్ణయాలు.. దేశ ఆర్థిక సుస్థిరతకు దోహదం చేస్తున్నాయి. ప్రధానంగా మదుపరులు, రుణగ్రహీతలు, వినియోగదారుల్లో క్రెడిట్‌ పాలసీపై నమ్మకాన్ని పెంచుతున్నాయి.

-దీపక్‌ సూద్‌, అసోచామ్‌ ప్రధాన కార్యదర్శి

వడ్డీరేట్లు తగ్గితే దేశ ఆర్థిక వ్యవస్థకు, రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమకూ లాభిస్తుంది. ద్రవ్యోల్బణం తగ్గుతుండటం, ఊహించిన దానికంటే జీడీపీలో వృద్ధి కనిపిస్తుండటం ఆహ్వానించదగ్గ పరిణామం. పరిస్థితులు ఇలాగే ఉంటే రెపోరేటు త్వరలోనే తగ్గవచ్చు.

-బొమన్‌ ఇరానీ, క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు

You may also like
TGSPDCL FIELD WORKERS
జోరు వర్షంలోనూ మరమ్మతులు.. విద్యుత్ కార్మికుల సాహసం!
తెలుగురాష్ట్రాల్లో వరదలు..చిరంజీవి మనవి
సీఎం రేవంత్ సంచలన నిర్ణయం ?..ఆ సినిమాపై నిషేధం ?
భారీ వర్షాలు..ఇంటిముందు దర్శనమిచ్చిన 15 అడుగుల మొసలి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions