Modi In Vizag Yogandra Celebrations | అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా శనివారం విశాఖపట్నంలో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ విశాఖ ప్రజలతో కలిసి యోగాసనాలు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యోగాకు వయసు, హద్దులు వంటి పరిమితులు లేవని, ఇది అందరికీ చెందిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల జీవనశైలిలో యోగా అంతర్భాగంగా మారిందని, ఇది ప్రపంచాన్ని ఏకం చేసే శక్తిగా నిలిచిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన “యోగాంధ్ర” కార్యక్రమాన్ని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఐక్యరాజ్యసమితిలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలని భారత్ ప్రతిపాదించినప్పుడు అతి తక్కువ సమయంలోనే 175 దేశాలు మద్దతు పలికాయని ప్రధాని గుర్తుచేశారు. “యోగ అందరిదీ, అందరి కోసం” అనే సందేశం ప్రతిధ్వనిస్తోందని ఆయన పేర్కొన్నారు.
“ఒకే భూమి – ఒకే ఆరోగ్యం కోసం యోగా” అని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం అనేక ఒత్తిళ్లతో సతమతమవుతోందని, పలు ప్రాంతాల్లో అశాంతి, అస్థిరత నెలకొన్నాయని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో యోగా శాంతి దిశగా మార్గం చూపుతుందని అన్నారు. యోగాను ఒక ప్రజా ఉద్యమంగా మార్చి, ప్రపంచాన్ని శాంతి, ఆరోగ్యం, సామరస్యం వైపు నడిపించాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.