PM to Visit Telangana | ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. జూలై 8న పీఎం ఉమ్మడి జిల్లా వరంగల్ పలు అభివ్రుద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
కాజీపేటలో పీరియాడికల్ వ్యాగన్ ఓవర్ హ్యాలింగ్ (POH) వర్క్ షాప్, వ్యాగన్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
మొదట ప్రధాని పర్యటన జులై 12న ఉంటుందని పిఎంవో ప్రకటించించింది. కానీ తాజాగా మార్పులు చేసి జులై 8కి షెడ్యూల్ ఫిక్స్ చేసింది.
ఆ రోజు ఉదయం ప్రధాని హన్మకొండకు చేరుకుంటారు. అటునుంచి వరంగల్ లోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
అనంతరం కాజీపేట శివారులోని అయోధ్య పురంలో రూ. 386 కోట్ల వ్యయంతో సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్న పివోహెచ్, వ్యాగన్ తయారీ యూనిట్ కు శంకుస్థాపన చేయనున్నారు.
తర్వాత సుభేదారిలోని ఆర్ట్స్ కళాశాల మైదానం లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు.
కాగా ప్రధాని తన పర్యటనలో గీసుకొండలో పీఎం మిత్ర పథకం కింద మెగా టెక్స్ టైల్ పార్కుకు కూడా శంకుస్థాపన చేయాల్సి ఉండగా, అది రద్దు అయ్యింది.
తెలంగాణ ప్రభుత్వం ఎన్ఓసి ఇవ్వకపోవడం వల్లనే ఈ కార్యక్రమం రద్దు అయినట్లు బీజేపీ వర్గాలు ప్రకటించాయి.
బీజేపీ నేతల్లో సర్వత్రా ఉత్కంఠ..
కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీలో కొన్ని ప్రతికూత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రధాని పర్యటనతో పార్టీ నేతల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది.
మోదీ రాష్ట్ర నాయకులతో ఏవైనా రాజకీయాలు చర్చిస్తారా అనే సందేహం నెలకొంది. రాష్ట్ర పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలపై మోదీ క్లాస్ తీసుకునే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
నాయకత్వ పోరు, పలువురు నాయకులు అసంతృప్తిగా ఉండటం ఇలా అన్ని సమస్యలకు ప్రధాని పర్యటన పరిష్కారం చూపుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల భోపాల్ లో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ కేసీఆర్ పై ప్రత్యక్షంగా ఆరోపణలు చేయడం ద్వారా టి బీజేపీలో జోష్ నింపారు.
మరి ఇప్పుడు వరంగల్ వేదికగా ప్రధాని ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారని ఆసక్తి నెలకొంది.