PM Modi Pays Tribute To Nethaji | భారత స్వాతంత్య్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Subhash Chandrabose) 129వ జయంతి సందర్భంగా శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) నివాళులు అర్పించారు.
ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేశారు. ఈ రోజును దేశవ్యాప్తంగా ‘పరాక్రమ్ దివస్’గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. స్వాతంత్ర్య ఉద్యమంలో నేతాజీ చూపిన అజేయ ధైర్యం, అచంచల సంకల్పం, అసమాన సేవలు తరతరాలకు ప్రేరణగా నిలుస్తున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
ఆయన నిర్భయ నాయకత్వం బలమైన, ఆత్మనిర్భర భారత నిర్మాణానికి దారితీస్తోందన్నారు. గతంలో నేతాజీ వారసత్వాన్ని నిర్లక్ష్యం చేశారని, ఇప్పుడు ఆయన జీవితం, ఆదర్శాలను దేశానికి చేరువ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
నేతాజీ ఫైళ్లను బహిర్గతం చేయడం, ఎర్రకోటలో జాతీయ పతాకం ఎగురవేయడం, అండమాన్‌లో ద్వీపాలకు పేర్లు మార్చడం, ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటు చేయడం వంటి చర్యలు ఆయనకు ఇచ్చిన గౌరవానికి నిదర్శనమని మోదీ అన్నారు.









