Padi Kaushik Reddy Comments On Karimnagar CP | కరీంనగర్ సీపీ గౌశ్ ఆలంపై బీఆరెస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన మతపరమైన వ్యాఖ్యలు తీవ్ర వివాదంగా మారాయి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డిపై తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఏఐఎంఐఎం పార్టీ కౌశిక్ పై కన్నెర్ర చేసింది. హుజురాబాద్ నియోజకవర్గం వీణవంకలో గురువారం జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్తున్న సమయంలో పోలీసులు పాడి కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో కౌశిక్ రెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఈ సమయంలో ఆయన పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కరీంనగర్ సీపీపై మతపరమైన అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ఈ నేపథ్యంలో స్పందించిన తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెప్పాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేసింది. మరోవైపు ఎంఐఎం స్పందిస్తూ..కౌశిక్ రెడ్డి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించింది. బీఆరెస్ ఎమ్మెల్యే అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. కరీంనగర్ సీపీ మత విశ్వాసంపై దాడి చేసే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని తెలిపింది. కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే యాంటీ ముస్లిం ద్వేషపూరిత వ్యాఖ్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని అసదుద్దీన్ ఒవైసీ పార్టీ డిమాండ్ చేసింది.









