Owaisi Slams Martyrdom Claim in Umar Nabi Video | ఉగ్రవాద దాడులు, ఆత్మాహుతి దాడులపై ఉమర్ నబీ చేసిన వ్యాఖ్యలపై తాజగా స్పందించారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ. అమయకులని చంపడం మహా పాపం అని స్పష్టం చేశారు.
జమ్మూ కశ్మీర్-హర్యానా పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ద్వారా ఫరీదాబాద్ లో వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ను భగ్నం చేసిన విషయం తెల్సిందే. అదే రోజు ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారులో భారీ బ్లాస్ట్ జరిగింది. ఈ దాడి చేసింది వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ లో భాగమైన ఉమర్ నబీనే. అయితే ఉమర్ నబీకి సంబంధించిన ఓ సెల్ఫీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో అతడు ఉగ్రవాదుల సూసైడ్ బాంబింగ్ గురించి మాట్లాడుతూ..దీనిని అందరూ తప్పుగా అర్ధం చేసుకుంటారని, అదొక బలిదాన ఆపరేషన్ అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.
ఈ క్రమంలో ఉమర్ నబీ ఉగ్రదాడులపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఒవైసీ ఇస్లాంలో ఆత్మహత్య అనేది హరామ్ అని పేర్కొన్నారు. అంటే అది నిషేధం అని అన్నారు. అలాగే అమాయకులను చంపడం మహా పాపం అని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలు ఇస్లాం మతానికి వ్యతిరేకం అని అన్నారు. ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడులను బలిదాన ఆపరేషన్లు అని అభివర్ణించే వారు కచ్చితంగా ఉగ్రవాదులే అని తేల్చేశారు. ఇదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పై ఫైర్ అయ్యారు ఒవైసీ.
ఆపరేషన్ సింధూర్, మహాదేవ్ సమయంలో పార్లమెంటులో ప్రసంగించిన అమిత్ షా గత ఆరు నెలల్లో ఏ కశ్మీరీ కూడా ఉగ్రవాద సంస్థల్లో చేరలేదని చెప్పారని ఒవైసీ తెలిపారు. అయితే ఫరీదాబాద్ లో వెలుగులోకి వచ్చిన టెర్రర్ మాడ్యూల్ ఎలా ఏర్పడిందని, ఈ మాడ్యూల్ ను గుర్తించడంలో విఫలం అయినందుకు బాధ్యత ఎవరు వహించాలని ఒవైసీ ప్రశ్నించారు.









