Odisha tribal couple yoked to plough and forced to till field as punishment | ఒడిశా రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. గిరిజన గ్రామ నమ్మకాలకు, కట్టుబాట్లకు వ్యతిరేకంగా వివాహం చేసుకున్నారని ఆరోపిస్తూ గ్రామ పెద్దలు దారుణ శిక్ష విధించారు.
యువతీ, యువకుడి భుజాలపై నాగలి పెట్టి పొలాన్ని దున్నించారు. అలాగే కర్రలతో వారిని కొట్టారు. ఒడిశా రాయగఢ జిల్లా కె. సింగుపూర్ సమితిలోని కంగరామ్ జోడి గ్రామానికి చెందిన లకొ సరక, కలియ సరక అనే యువతీయువకుడు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
పెళ్లి చేసుకునేందుకు పెద్దలకు చెప్పారు. అయితే సదరు యువతి యువకుడికి పిన్ని వరుస అవుతుంది. ఈ నేపథ్యంలో గ్రామపెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. ఇది గ్రామ కట్టుబాట్లకు వ్యతిరేకం అని, ఒకే వంశానికి చెందిన వారు వివాహం చేసుకునేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
అలాగే ఇద్దరినీ దూరంగా ఉండాల్సిందిగా తీర్పు చెప్పారు. అయినప్పటికీ ఆ ఇద్దరూ మాత్రం ప్రేమను కొనసాగించారు. ఇటీవల ఈ ఇద్దరూ కలిసి ఉండటాన్ని గమనించిన ఓ వ్యక్తి గ్రామ పెద్దలకు చెప్పాడు. దింతో గ్రామపెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసి, వారిని గ్రామ దేవత వద్దకు తీసుకువచ్చి శుద్ధి పూజలు చేశారు.
ఆ తర్వాత ఇద్దరినీ పొలంలోకి తీసుకెళ్లారు. అక్కడ భుజాలకు నాగలి కట్టి, కర్రలతో కొడుతూ ఈడ్చుకుంటూ పొలాన్ని దున్నించారు. శిక్ష ముగిసిన తర్వాత గ్రామం నుండి వారిని వెలివేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా ఒకే వంశంలోని ఇద్దరు పెళ్లిచేసుకుంటే గ్రామంలో వర్షాలు పడవని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు.