Nitish Reddy Cleared to Play IPL 2025 | గాయాల కారణంగా పలువురు స్టార్ ఆటగాళ్లు ఐపీఎల్ లో ఆడడం పై సందిగ్దత నెలకొంది. ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో అనేదానిపై ఇంకా ఓ స్పష్టత రాలేదు.
అలాగే మరికొందరు స్టార్ ఆటగాళ్లు కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో ఇంగ్లాండ్ తో టీ-20 సిరీస్ సందర్భంగా గాయపడిన ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ లో ఆడడం ఖాయమయినట్లు తెలుస్తోంది.
ఇంగ్లాండ్ తో రెండవ టీ-20 కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో నితీష్ పక్కటెముకల గాయం బారిన పడ్డారు. దింతో అతను ఇంగ్లాండ్ తో జరిగిన టీ-20, వన్డే సిరీస్ కు దూరమయ్యారు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున నితీష్ ఆడుతారా అనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి.
కానీ నితీష్ కు బీసీసీఐ నుంచి ఫిట్నెస్ క్లియరెన్స్ వచ్చినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో జరిగిన ఫిట్నెస్ టెస్టును నితీష్ విజయవంతంగా పూర్తి చేసినట్లు సమాచారం. అలాగే యో-యో టెస్టు కూడా పాస్ అయినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి.
ఈ క్రమంలో ఐపీఎల్ లో ఈ స్టార్ ఆల్ రౌండర్ ఆడడం ఖాయమైంది. గతేడాది జరిగిన మెగా ఆక్షన్ కంటే ముందు నితీష్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.6 కోట్లకు రిటైన్ చేసుకున్న విషయం తెల్సిందే.