Nitish Kumar announces 125 units of free electricity for households in Bihar from August 1 | బీహార్ రాష్ట్రంలో అతి త్వరలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు వరుస తీపి కబురులు అందిస్తున్నారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్.
మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తాజగా 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. తాము ప్రారంభం నుండి అందరికీ తక్కువ ధరలకు విద్యుత్‌ను అందిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.
ఇప్పుడు ఆగస్ట్ ఒకటి నుండి రాష్ట్రంలోని గృహ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ను అందించనున్నట్లు స్పష్టం చేశారు. అంటే జులై నెల బిల్లు కట్టాల్సిన పని లేదన్నారు. దీని ద్వారా కోటి 67 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
అంతేకాకుండా, రాబోయే మూడేళ్ళలో గృహ వినియోగదారులందరి మద్దతుతో ప్రతీ ఇంటిపై సోలార్ పవర్ ప్లాంట్లను అమార్చాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కుటీర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు ప్రభుత్వమే డబ్బులు చెల్లించి సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుందని, మిగిలిన కుటుంబాలకు కూడా తగిన విధంగా ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు.
రాబోయే మూడేళ్ళలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అంచనా వేశారు.









