Netaji Subhash Chandrabose Jayanti | నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నేపథ్యంలో దివంగత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన ఆరోపణలు చేశారు కేంద్ర మాజీ మంత్రి సుబ్రమణ్య స్వామి. జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకుని యావత్ దేశం ‘పరాక్రమ్ దివాస్’ జరుపుకుంటోంది. మరోవైపు ఇదే రోజు గణతంత్ర దినోత్సవ ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలో స్పందించిన సుబ్రహ్మణ్య స్వామి రిపబ్లిక్ డే కోసం జనవరి 23నే ఉద్దేశ్యపూర్వకంగా రిహార్సల్ డే గా నిర్ణయించారని పేర్కొన్నారు.
నేతాజీపై ఉన్న ఈర్ష్య మూలంగానే 1950లో నెహ్రు ఈ నిర్ణయం తీసుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. నేతాజీ పాపులారిటీపై ఈర్ష్యతోనే ఆయన జయంతిని ఘనంగా జరుపుకోకూడదు అనే ఉద్దేశ్యంతోనే నెహ్రు ఇలా చేశారని మండిపడ్డారు. అలాగే ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అప్పటి సంప్రదాయాన్నే కొనసాగించడం పట్ల సుబ్రమణ్య స్వామి మండిపడ్డారు. జనవరి 22 లేదా 24న రిహార్సల్స్ డే ను నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ మోదీ అలా చేయడం లేదన్నారు. ఎందుకు, భయమా అని ప్రశ్నించారు.








