Nandamuri Balayya Warning | సినీ నటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హైదరాబాద్ లో బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ హస్పిటల్ (Basavatarakam Indo American Cancer Hospital) నెలకొల్పి కేన్సర్ బాధితులకు వైద్యం అందిస్తున్న విషయం తెలిసిందే.
అయితే తాజాగా ఈ హాస్పిటల్ పేరుతో ఓ వ్యక్తి ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు బాలక్రిష్ణ దృష్టికి వచ్చింది. అయితే ఆ ఈవెంట్ కు తన అనుమతి, హాస్పిటల్ అధికారిక ఆమోదం లేదని, ప్రజలెవరూ మోసపోవద్దని బాలయ్య హెచ్చరించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు.
“బంగారు బాలయ్య – బసవతారకం ఈవెంట్” పేరిట అశ్విన్ అట్లూరి అనే వ్యక్తి నా పేరు, మరియు బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరును అనుమతిలేకుండా ఉపయోగిస్తూ ఈ కార్యక్రమాన్ని విరాళాల సేకరణ కోసం నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఈవెంట్ కి నా అనుమతి లేదు.
హాస్పిటల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఎటువంటి అధికారిక ఆమోదం లేదు. కాబట్టి నా విజ్ఞప్తి దయచేసి ఈ రకమైన అనధికారిక, తప్పుదారి పట్టించే కార్యక్రమాల పట్ల అప్రమత్తంగా ఉండండి. బసవతారకం హాస్పిటల్ తరఫున జరిగే అన్ని అధికారిక కార్యక్రమాలు, విరాళాల అభ్యర్థనలు కేవలం ధృవీకరించబడిన, పారదర్శకమైన మాధ్యమాల ద్వారానే నిర్వహించబడతాయి. మోసపూరిత ప్రకటనలు, కార్యక్రమాలను నమ్మి మోసపోవద్దు” అని పేర్కొన్నారు బాలయ్య.








