Pranay Murder Case | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో నల్గొండ కోర్టు సోమవారం తుది తీర్పును వెల్లడించింది. ఈ కేసులో ఏ 2 గా ఉన్న సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
మిగిలిన నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ, ఎస్టీ సెషన్స్ రెండో అదనపు న్యాయ స్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది. కాగా, ఈ కేసులో ఏ1 గా ఉన్న మారుతీ రావు గతంలోనే ఆత్మహత్య చేసుకున్నారు.
2018లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన మారుతీరావు కుమార్తె అమృత, అదే పట్టణానికి చెందిన ప్రణయ్ ప్రేమించ పెళ్లి చేసుకున్నారు. తన కుమార్తె కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతో అమృత తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌ను హత్య చేయించాడు. ఈ పరువు హత్య రెండు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది.
మృతుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదుతో 8 మందిపై పలు సెక్షన్ల కింద మిర్యాలగూడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి 2019 జూన్ 12న 1600 పేజీల్లో చార్జిషీట్ దాఖలు చేశారు.
అప్పటి ఎస్పీ ఏవీ రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ జరిపిన పోలీసులు, ప్రణయ్ హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించారు. ఆ తర్వాత ఎస్సీ, ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టులో 5 సంవత్సరాల 9 నెలల పాటు కేసు విచారణ జరిగింది. చార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించింది. ఇవాళ తుది తీర్పు వెలువరించింది.










