New Ration Cards in TG | తెలంగాణలో ఏడాది కిందట కొత్త ప్రభుత్వం ఏర్పడి నాటి నుంచి రాష్ట్రంలో నూతన రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్న వారు తమ కుటుంబానికి రేషన్ కార్డుల కోసం గత కొన్నేళ్లుగా పడిగాపులు కాస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల మంజూరుపై తాజాగా సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ శుభవార్త చెప్పారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మండలిలో సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి ఉత్తమ్ బదులిచ్చారు.
అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ ప్రక్రియ త్వరలోనే చేపడుతామని.. సంక్రాంతి నుంచి రేషన్ కార్డుల మంజూరీ ఉంటుందని చెప్పారు. ఇప్పటికే రేషన్ కార్డుల మంజూరు విషయంపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్లు గుర్తుచేశారు.
దాదాపు తెలంగాణ వ్యాప్తంగా 36 లక్షల మందికి కొత్తగా రేషన్ కార్డులు మంజూరు చేసే ఆలోచనలో ఉన్నట్లు వెల్లడించారు. కొత్తగా రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా సన్నబియ్యం కూడా ఇస్తామని మంత్రి ఉత్తమ్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.