Indiramma Houses | ఇండ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు (Indiramma Houses) నిర్మిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకంపై తెలంగాణ గృహనిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) కీలక ప్రకటన చేశారు.
నవంబర్ 6 నుంచి ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపిక ఉంటుందని తెలిపారు. ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నా ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేస్తామని చెప్పారు. 15 రోజుల్లొ గ్రామ కమిటీల ద్వారా ఎంపిక పూర్తి చేసి ఆ వెంటనే జాబితాలను ఖరారు చేస్తామన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియగా ఉంటుందని పేర్కొన్నారు. రేషన్ కార్డు లేకపోయినా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు పొంగులేటి. మొదటి విడతలో రేషన్ కార్డులు లేనివారికి కూడా ఇండ్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.
రెండో విడత నుంచి మాత్రం రేషన్ కార్డు ఉంటేనే అర్హులని చెప్పారు. ఇక గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల ఎంపికే ఫైనల్ అని మంత్రి వెల్లడించారు. ఇండ్లు మహిళల పేరిటే మంజూరు చేస్తారని.. లబ్దిదారులే సొంతంగా ఇండ్లు నిర్మించుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు.
పునాదికి రూ.లక్ష, గోడలకు రూ లక్షా ఇరవైఐదు వేలు, శ్లాబ్‌కు లక్షా యాభైవేలు, ఇళ్లు పూర్తయిన తర్వాత మరో లక్ష చొప్పున అందజేస్తామని తెలిపారు.









