Indiramma Indlu | తెలంగాణలోని నిరుపేదల సొంతింటి నిర్మాణానికి ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకంపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన అసెంబ్లీలో రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవానికి ఇందిరమ్మ ఇండ్ల (Indiramma Indlu) మంజూరు నిరంతర ప్రక్రియగా జరుగుతుందని, ఇప్పటికే ఒక విడత ఇండ్లు మంజూరు చేశామని, మరో మూడు విడతలుగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
గత ప్రభుత్వంలాగ ఎన్నికలప్పుడే ఇండ్ల గురించి హామీలు ఇవ్వకుండా తాము చిత్తశుద్దితో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే ఇందిరమ్మ ఇండ్ల పథంకం కింద ప్రతి సంవత్సరం మార్చి- ఏప్రిల్ నెలల కాలంలో ఇండ్లను మంజూరు చేస్తామని అన్నారు.
ఇప్పటికే తొలి విడతగా మంజూరు చేసిన 4.50 లక్షల ఇండ్లలో సుమారు 3లక్షల ఇండ్లు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని, సుమారు 52వేల ఇండ్లు గృహప్రవేశానికి సిద్దంగా ఉన్నాయని తెలిపారు. వచ్చే వర్షాకాలంలోగా తొలివిడత మంజూరైన ఇండ్ల నిర్మాణం పూర్తవుతుందన్నారు. మరో మూడువిడతలుగా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు జరుగుతుందని వెల్లడించారు.
రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించి అసంపూర్తిగా వదిలేసి, ఆర్ధిక సాయం అందించని ఇండ్లకు తమ ప్రభుత్వం 204 కోట్ల రూపాయిలను విడుదల చేసిందని, రాష్ట్రంలోని 133 కాలనీల్లో 36వేల ఇండ్లు మొండిగోడలతో మిగిలిపోయాయని, మౌళిక సదుపాయాలకు నోచుకోలేదని చెప్పారు. ఈ నేపథ్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు, డిప్యూటీ సిఎం భట్టిగారి సూచనల మేరకు744 కోట్ల రూపాయిలతో పౌర సదుపాయాలు కల్పించామని తెలిపారు.
కొన్ని 2 బిహెచ్కే ఇండ్లను నిర్మించి ఎవరికీ కేటాయించలేదని, అసంపూర్తి ఇండ్ల కోసం 455 కోట్ల రూపాయిలు మంజూరు చేశామని వీటిని కూడా అర్హులకు అందజేస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వంలోని పెద్దమనిషి హామీ ఇచ్చి వదిలేసిన వాసాలమర్రిలో కూడా తామే ఇండ్లు నిర్మిస్తున్నట్లు మంత్రి సభకు తెలిపారు.
2 బిహెచ్కే ఇండ్లకు సంబంధించి అర్హులకు పార్టీప్రమేయం లేకుండా మంజూరు చేస్తామని అసంపూర్తి ఇండ్ల పూర్తి కోసం నిధుల మంజూరుకు ఇప్పటికే క్యాబినెట్ సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుందని, అర్బన్ పాలసీ మేరకు త్వరలో లబ్దిదారుల ఎంపిక జరుగుతుందన్నారు
2014లో రాష్ట్రంలో 3లక్షల రూపాయిల ఖర్చుకాగల ఇండ్లను అప్పటి ప్రభుత్వం మంజూరు చేసి నిధులు విడుదల చేయలేదని. అదేవిధంగా సుమారు 12 వేల ఇండ్లను పునాదుల స్ధాయిలోనే వదిలేసినందున వీటిపై నిర్ణయం తీసుకోవాల్సిఉందని తెలిపారు. ఈ పధకం కింద లబ్దిదారులకు అప్పటివరకు జరిగిన చెల్లింపులు మినహా మిగిలిన మొత్తాన్ని ఇస్తామని, అర్హులను గుర్తించి నిజమైన పేదలకు అందజేస్తామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో యుద్దప్రాతిపదికన 2బిహెచ్కే ఇండ్ల నిర్మాణం, మౌళిక సదుపాయాల కల్పన, ప్రజాప్రతినిధుల సూచనల అమలు తదితర అంశాలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిహెచ్ఎంసీ పరిధిలో గృహనిర్మాణానికి స్దలాలను గుర్తించి మంజూరు చేస్తామన్నారు.
ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇండ్ల సమస్యలపై ప్రజాప్రతినిధులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎల్-1, ఎల్-2, ఎల్-3 వారీగా గుర్తిస్తామని, రాష్ట్రంలో ఇప్పటికే 20 లక్షల మందిని గుర్తించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సిద్దంగా లభ్యమయ్యే స్ధలాలను గుర్తిస్తే వాటిని నిరుపేదలకు ఇండ్ల స్ధలాలుగా మంజూరు చేస్తామని అన్నారు.
కొన్ని ప్రాంతాల్లో 400-600 చదరపు అడుగుల పరిమితికి మించి ఇండ్లు నిర్మించుకున్నవారికి మినహాయింపు ఇస్తామని, గిరిజన ప్రాంతాల్లో అటవీశాఖతో సమస్యలు రాకుండా స్ధలాల మంజూరు, ఇండ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు.
సింగరేణి ప్రాంతంలో ఇండ్ల పట్టాల పెండింగ్ సమస్యను కూడా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వానికి ఎన్ని ఆర్దిక ఒడుదుడుకులు ఉన్నాసరే అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, నిర్మాణం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.









