Retired judge celebrates daughter’s divorce | భారతీయ సమాజంలో విడాకులు అంటే ఇప్పటికీ ఒక సామాజిక మచ్చగా, కుటుంబానికి అవమానంగా భావిస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఒక తండ్రి వినూత్నంగా తన కూతురి విడాకులను డప్పులు, మిఠాయిలతో వేడుకగా జరిపించారు.
రిటైర్డ్ జడ్జి అయిన డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ, తన ఏకైక కుమార్తె ప్రణీతకు విడాకులు మంజూరైన సందర్భంగా కోర్టు ఆవరణలోనే సంబరాలు నిర్వహించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ కుమార్తె ప్రణీతకు 2018లో ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్న గౌరవ్ అగ్నిహోత్రితో వివాహమైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు.
అయితే పెళ్లయిన నాటి నుండి అత్తమామల వేధింపులు, భర్తతో మనస్పర్థల కారణంగా ప్రణీత తీవ్ర మానసిక క్షోభ అనుభవించింది. 2021లోనే విడాకుల ప్రక్రియ మొదలైనప్పటికీ, కుటుంబాన్ని కాపాడుకోవాలని ఆమె ఎంతో ప్రయత్నించింది. కానీ వేధింపులు మితిమీరడంతో చివరకు విడాకులే మార్గమని నిర్ణయించుకుంది.
కుమార్తె కష్టాల్లో ఉన్నప్పుడు ఆమెకు అండగా నిలవడమే కాకుండా, విడాకులు వచ్చాక ఆమె కుంగిపోకుండా ఉండేందుకు డాక్టర్ శర్మ వినూత్నంగా ఆలోచించారు.
కుటుంబ సభ్యులందరూ “I Love My Daughter. My Heart, My Soul” అని రాసి ఉన్న నల్లటి టీషర్టులు ధరించి కోర్టుకు చేరుకున్నారు. ప్రణీత కూడా “My Family, My Life” అని రాసి ఉన్న టీషర్టు ధరించడం విశేషం. కోర్టు తీర్పు వెలువడగానే కోర్టు బయట డప్పులు కొట్టిస్తూ, లడ్డూలు పంచుతూ డాన్సులు చేశారు.
పుట్టినప్పుడు ఎంత సంతోషమో.. ఇప్పుడూ అంతే..
ఈ సందర్భంగా డాక్టర్ జ్ఞానేంద్ర శర్మ మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రతి ఒక్కరినీ కదిలిస్తున్నాయి. “నా కూతురు పుట్టినప్పుడు ఎంతటి సంతోషంతో డప్పులు కొట్టించానో.. ఈరోజు తన నరకప్రాయమైన బంధం నుంచి విముక్తి పొందినప్పుడు కూడా అంతే సంతోషంగా ఉన్నాను.
ఆడపిల్ల విలువ ఏ దశలోనూ తగ్గదు. విడాకులు అంటే జీవితం ముగిసిపోవడం కాదు, గౌరవంగా బతకడం” అని ఆయన పేర్కొన్నారు. 2022లో ప్రణీత సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించిన బాధలో ఉన్న ఆ కుటుంబానికి, ప్రణీత ఎదుర్కొన్న వేధింపులు మరింత కుంగదీశాయి.
అయినప్పటికీ, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతో ఆమె ధైర్యంగా ముందుకు సాగింది. సమాజం ఏమనుకుంటుందో అని భయపడే తల్లిదండ్రులకు, ఈ రిటైర్డ్ జడ్జి ఒక గొప్ప మార్గదర్శిగా నిలిచారు.






