Mauritius President visits Tirumala temple | మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. క్షేత్ర సాంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకుని శ్రీవారి ఆలయం వద్దకు విచ్చేసిన ఆయనకు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్.నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించిన అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకున్నారు.
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శేష వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్, పంచగవ్య ఉత్పత్తులను అందజేశారు. కాగా మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోగుల్ మంగళవారం సాయంత్రం తిరుచానూరులోని పద్మావతీ అమ్మవారిని దర్శించుకున్నారు.









