Maha Kumbh Mela Stampede News | మహా కుంభమేళాలో భాగంగా త్రివేణి సంగమంలో పవిత్ర స్నానమాచరించేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు.
అయితే బుధవారం తెల్లవారుజామున కుంభమేళాలో పెను విషాదం చోటుచేసుకుంది. అక్కడ జరిగిన తొక్కిసలాటలో పదుల సంఖ్యలో భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని భక్తులు పెద్దఎత్తున ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు.
ఈ క్రమంలో నెలకొన్న రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఈ ఘటన పట్ల ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రగాఢ సానుభూతుని ప్రకటించారు. కాగా ఈ తొక్కిసలాట గల కారణాల పై అనేక విశ్లేషణలు వస్తున్నాయి. మరీ ముఖ్యంగా చెత్త డబ్బాల కారణంగా తొక్కిసలాట జరిగినట్లు పలువురు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
‘మౌని అమావాస్య నేపథ్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో కుంభమేళాకు తరలివచ్చారు. బుధవారం తెల్లవారుజామున ఒకటి నుండి రెండు గంటల ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. ఆ చిమ్మ చీకట్లో త్రివేణి సంగమంలో స్నానమాచరించేందుకు భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. అయితే భక్తుల కోసం ఇదే ప్రాంతంలో ఇనుప చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. ఓ వైపు చిమ్మ చీకటి, మరోవైపు భక్తులకు స్నానం చేసేందుకు ఎటు వెళ్లాలో తెలీదు. ఇదే సమయంలో కొందరు భక్తుల కాళ్లకు ఇనుప చెత్త డబ్బాలు తగిలి కిందపడిపోయారు. దింతో తొక్కిసలాట జరిగింది’ అని ప్రత్యక్ష సాక్షి వివేక్ మిశ్రా తెలిపారు.
తొక్కిసలాట ఘటన త్రివేణి సంగమానికి కిలోమీటరు దూరంలో జరిగింది. భక్తులంతా త్రివేణి సంగమం ప్రధాన ఘాట్ వద్దే స్నానాలు చేయాలని భావించారు, ఈ క్రమంలో బ్యారికేడ్లు విరిగి తొక్కిసలాట జరిగిందని అధికారులు పేర్కొన్నారు.
అయితే మృతుల సంఖ్యపై యూపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు తొక్కిసలాట ఘటన పై ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ స్పందించారు.
‘మౌని అమావాస్య నేపథ్యంలో సుమారు 10కోట్ల మంది భక్తులు తరలివచ్చారు. దింతో రద్దీ ఎక్కువైంది. బ్యారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ భక్తులు వాటిని దాటాలని ప్రయత్నించడం మూలంగానే ఈ ఘటన జరిగింది. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం నుండి ఇప్పటివరకు నాలుగు సార్లు ఫోన్ చేశారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా కూడా ఫోన్ చేశారు.’ అని సీఎం వెల్లడించారు.
మరోవైపు తొక్కిసలాట ఘటనపై విపక్షాలు బీజేపీ ప్రభుత్వం పై దుమ్మెత్తిపోస్తున్నాయి. సామాన్య భక్తులను మరిచి కేవలం వీఐపీ భక్తుల కోసమే అధికారులు పనిచేయడం మూలంగానే ఈ తొక్కిసలాట ఘటన జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఇకనైనా బీజేపీ సర్కారు మేల్కోవాలని అన్నారు.
బుధవారం తెల్లవారుజాము నుండి కేవలం ఉదయం 9 గంటల వరకే సుమారు మూడు కోట్ల మంది పుణ్య స్నానమాచరించినట్లు అధికారులు వెల్లడించారు.