Tuesday 7th April 2026
12:07:03 PM
Home > క్రైమ్ > 9 మంది పోలీసులకు మరణశిక్ష.. మధురై కోర్టు సంచలన తీర్పు!

9 మంది పోలీసులకు మరణశిక్ష.. మధురై కోర్టు సంచలన తీర్పు!

madhurai court

Sattankulam custodial death case verdict | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాతన్‌కుళం తండ్రీకొడుకుల (జయరాజ్ – బెన్నిక్స్) లాకప్ డెత్ కేసులో మదురై ఒకటవ అదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు సోమవారం తుది తీర్పు వెలువరించింది.

విధుల్లో ఉండి రక్షించాల్సిన వారే భక్షకులుగా మారి, అమానవీయంగా ప్రవర్తించినందుకు గాను ఇన్‌స్పెక్టర్‌తో సహా మొత్తం తొమ్మిది మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ జడ్జి జి. ముత్తుకుమారన్ తీర్పు చెప్పారు.

కేసు నేపథ్యం ఇదీ..
2020 జూన్ నెలలో కరోనా లాక్డౌన్ నిబంధనలను అతిక్రమించి రాత్రి వేళ దుకాణం తెరిచి ఉంచారనే చిన్న కారణంతో మొబైల్ షాపు యజమాని పి. జయరాజ్ (58), అతని కుమారుడు జె. బెన్నిక్స్ (31) లను సాతన్‌కుళం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఆ రాత్రంతా పోలీస్ స్టేషన్‌లో వారిని చిత్రహింసలకు గురిచేయడంతో, తీవ్ర గాయాలపాలైన తండ్రీకొడుకులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా నిరసనలకు దారితీసింది.

కోర్టు తీర్పులోని ప్రధానాంశాలు:

ఈ కేసును ‘రేరెస్ట్ ఆఫ్ ది రేర్’ (Rarest of Rare) కేటగిరీగా కోర్టు పరిగణించింది. చట్టాన్ని కాపాడాల్సిన వారే పగతో రాత్రంతా క్రూరంగా దాడి చేసి ప్రాణాలు తీయడం సమాజం తలదించుకునే చర్య అని జడ్జి వ్యాఖ్యానించారు.

ఇన్‌స్పెక్టర్ శ్రీధర్, సబ్-ఇన్‌స్పెక్టర్లు రఘు గణేష్, బాలకృష్ణన్, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, నలుగురు కానిస్టేబుళ్లకు మరణశిక్షతో పాటు భారీగా జరిమానా విధించింది.

మృతుల కుటుంబానికి నిందితుల నుండి మొత్తం రూ. 1.40 కోట్ల పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసును సిబిఐ (CBI) అత్యంత వేగంగా విచారించి సుమారు 2,427 పేజీల ఛార్జిషీట్‌ను దాఖలు చేసింది. మొత్తం 105 మంది సాక్షులను కోర్టు విచారించింది.

లాకప్ డెత్ కేసుల్లో ఒకేసారి ఇంతమంది పోలీసులకు మరణశిక్ష పడటం భారత న్యాయ చరిత్రలో ఇదే మొదటిసారి. పోలీసు వ్యవస్థలో జవాబుదారీతనం పెంచేందుకు ఈ తీర్పు ఒక మైలురాయిగా నిలుస్తుందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరణ శిక్ష పడిన పోలీసులు

    Leave a Reply

    Skip to toolbar

    Designed & Developed By KBK Business Solutions