KTR meets Jeevan Reddy | తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి ఇటీవలే రాజీనామా చేసిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ (భారత్ రాష్ట్ర సమితి)లో చేరారు.
గురువారం మధ్యాహ్నం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జగిత్యాలలోని జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి, ఆయనను పార్టీలోకి అధికారికంగా ఆహ్వానించారు. సుమారు గంటపాటు సాగిన ఇరువురి భేటీలో రాజకీయ సమీకరణాలపై నేతలు చర్చించారు.
ఈ క్రమంలోనే జీవన్ రెడ్డి వంటి అనుభవజ్ఞుడైన నేతకు బీఆర్ఎస్ తగిన ప్రాధాన్యత ఇస్తుందని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో కె. కేశవరావు గారికి ఇచ్చిన సెక్రటరీ జనరల్ పదవిని జీవన్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం (ప్లీనరీ) సందర్భంగా అధినేత కేసీఆర్ సమక్షంలో ఆయన మరోసారి అధికారికంగా గులాబీ కండువా కప్పుకోనున్నారని సమాచారం.
జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాల మరియు ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ మరింత బలోపేతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






