Union Minister Kishan Reddy | దేశంలోని గనుల రంగంలో పారదర్శకత, ఆధునిక సాంకేతికతను జోడిస్తూ కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
ఢిల్లీలో జరిగిన నేషనల్ DMF సదస్సులో కేంద్ర గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి పాల్గొని, 7వ విడత క్రిటికల్ మినరల్ (కీలక ఖనిజాల) వేలం ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు. ఈ విడతలో మొత్తం 19 బ్లాకులకు వేలం నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇప్పటివరకు 6 విడతల్లో 46 క్రిటికల్ మినరల్ బ్లాక్స్‌ను విజయవంతంగా వేలం వేశామని, తాజా 19 బ్లాకులతో కలిపి ఈ సంఖ్య మరింత పెరగనుందని మంత్రి తెలిపారు. తొలిసారిగా నేషనల్ మినరల్ ఎక్స్‌ప్లొరేషన్ ట్రస్ట్ గుర్తించిన బ్లాక్స్‌ను కూడా ఈ వేలంలో చేర్చినట్లు పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాలు (EV), పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి మరియు రక్షణ రంగంలో ఈ క్రిటికల్ మినరల్స్ కీలక పాత్ర పోషిస్తాయని, గ్లోబల్ టెక్నాలజీ పోటీలో భారత్‌ను ఇవి ముందుంచుతాయని చెప్పారు.
“గనుల కోసం స్థలాలు ఇచ్చిన స్థానికుల సంక్షేమం మనందరి బాధ్యత. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ (DMF) ద్వారా గనుల ప్రభావిత ప్రాంతాల్లో విద్య, వైద్యం వంటి కనీస సదుపాయాలను కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించాం” అని మంత్రి వివరించారు.
దేశంలోని 23 రాష్ట్రాల పరిధిలో 656 జిల్లాల్లో DMFలు ఏర్పాటయ్యాయని మంత్రి తెలిపారు. DMF కింద సేకరించిన రూ. 1.24 లక్షల కోట్లలో, సుమారు రూ. 93,500 కోట్లు (70%) కేవలం యాస్పిరేషనల్ జిల్లాల నుంచే వస్తున్నాయని, ఆ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పనులు జరుగుతున్నాయని వెల్లడించారు.
2025 నాటికి 147 గనులను శాస్త్రీయంగా మూసివేసి, ఆ ప్రాంతాల్లో సుస్థిరమైన అభివృద్ధి పనులు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రధాని మోదీ గారి నాయకత్వంలో ప్రైవేటు రంగాన్ని భాగస్వామ్యం చేస్తూ, పర్యావరణానికి నష్టం కలగకుండా గనుల రంగం పురోగతి సాధిస్తోందని ఆయన పునరుద్ఘాటించారు.






