Kalvakuntka Kavitha News | దేవుడి దయతో తాను ముఖ్యమంత్రి అవుతానని అప్పుడు 2014 నుంచి జరిగిన అన్ని అక్రమాలను, అన్యాయాలను వెలికితీస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కవితపై కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో కవిత మాట్లాడారు. వారంలో కూకట్పల్లి ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పాలని లేదంటే కోర్టుకు వెళ్లనున్నట్లు ఆమె స్పష్టం చేశారు.
మాధవరం కృష్ణారావు ఓ చిన్న వ్యక్తి అని కొట్టిపారేసిన కవిత ఆయన వెనుక ఓ గుంట నక్క ఉండి నడిపిస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. వెకిలి చేష్టలు చేస్తున్న గుంటనక్కలు జాగ్రత్తగా ఉండలాని ఆమె హెచ్చరికలు జారీ చేశారు. తనతో పాటు తన భర్తపై కూడా విషం చిమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కవిత పార్టీ నుండి వెల్లగొట్టినా కళ్ళు చల్లారాలేదా అని అడిగారు. గతంలో తన భర్త అనిల్ ఫోన్ ను కూడా ట్యాప్ చేశారని కవిత బాంబు పేల్చారు. ఇంటి అల్లుడి ఫోన్ ట్యాప్ చేయడానికి సిగ్గుండాలి అని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ చాటున ఉంటూ కొందరు పందికొక్కుల్లా ప్రజల సొమ్మును తిన్నారని కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.









