ISRO Successfully Docks SpaDeX Satellites | భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో ( ISRO ) మరో అద్భుత ఘనతను సాధించింది.
నింగిలోని రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేసి ఇస్రో చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు కేవలం అమెరికా, చైనా, రష్యా దేశాలు మాత్రమే ఈ ప్రక్రియను చేపడుతున్నాయి.
తాజగా స్పేడెక్స్ ( SpaDex ) డాకింగ్ ( Docking ) ప్రక్రియను ఇస్రో విజయవంతంగా పూర్తిచేయడంతో భారత్ కూడా ఆ దేశాల సరసన నిలిచింది. గతేడాది డిసెంబర్ 30న తిరుపతి జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ60 ( PSLV C60 ) లో జంట ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది.
పీఎస్ఎల్వీ బయలుదేరిన సుమారు 15 నిమిషాల తర్వాత స్పేడెక్స్-1బి, స్పేడెక్స్-1ఏ రాకెట్ నుండి విడిపోయాయి. అనంతరం వీటి అనుసంధానం కోసం ఇస్రో మూడు సార్లు ప్రయత్నించింది. గురువారం వీటి డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తి అయినట్లు ఇస్రో ప్రకటించింది.
రెండు ఉపగ్రహాల మధ్య దూరాన్ని 15 మీటర్ల నుండి 3 మీటర్లకు తీసుకువచ్చారు. అనంతరం డాకింగ్ ప్రక్రియను ఇస్రో మొదలుపెట్టి విజయవంతంగా ముగించింది.