Indian-American Ghazala Hashmi Wins Virginia Lieutenant Governor Race | అమెరికా స్థానిక ఎన్నికల్లో భారతీయ మూలాలున్న నాయకులు సత్తా చాటుతున్నారు. ఇప్పటికే న్యూయార్క్ మేయర్ పదవికి భారత మూలాలున్న జోహ్రాన్ మమ్దాని ఎన్నికైన విషయం తెల్సిందే. మరోవైపు వర్జీనియా రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ గా భారత సంతతి గజాలా హష్మీ గెలుపొందారు.
ఈమెకు మన హైదరాబాద్ తో ప్రత్యేక అనుబంధం ఉంది. 1964లో గజాలా హైదరాబాద్ లో జన్మించారు. మలక్పేటలోని అమ్మమ్మ ఇంట్లో బాల్యాన్ని గడిపారు. తండ్రి జియా హష్మీ అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసేవారు. తల్లి తన్వీర్ హష్మీ ఉస్మానియా యూనివర్సిటీ మహిళల కళాశాలలో చదువుకున్నారు. గజాలా నాలుగేళ్ళ వయస్సులో తల్లి, సోదరుడితో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు.
ఆ తర్వాత జార్జియా రాష్ట్రంలో స్థిరపడ్డారు. విద్యారంగంలో 30 ఏళ్ల అనుభవం కలిగిన గజాలా 2019లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. వర్జీనియా స్టేట్ సెనేట్ కు ఎన్నికయ్యారు. డెమోక్రటిక్ అభ్యర్థిగా పోటీ చేసిన గజాలా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ రీడ్ ను ఓడించారు. అలాగే అమెరికా రాష్ట్రాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఎన్నికైన తొలి ముస్లిం మహిళగా ఈమె చరిత్రను సృష్టించారు.









