Khomeini Road In Hyderabad | ఇజ్రాయెల్-అమెరికా (Israel -USA) సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ (Khameini) మరణించిన విషయం తెల్సిందే. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న షియా ముస్లింలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ లోనూ నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇరాన్ సుప్రీం లీడర్ పేరుతో హైదరాబాద్ లోని ఒక రోడ్డు ఉందంటూ కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ రోడ్డు పేరు ప్రస్తుతం అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన అయతుల్లా అలీ ఖమేనీ పేరు మీద కాదు.. ఇరాన్ మొదటి సుప్రీం లీడర్ ఇమామ్ అయోతొల్లా సయ్యద్ రుహోల్లా ముసావీ ఖమోనీ జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టారు.
ఈయన ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు. 1979 నుంచి 1989 వరకు ఇరాన్ సుప్రీం లీడర్ గా వ్యవహరించారు. కుతుబ్ షాహీల కాలం నుంచి హైదరాబాద్‌కు, ఇరాన్ దేశానికి మధ్య బలమైన చారిత్రక, సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు ఉన్నాయి.
ఆ దౌత్యపరమైన బంధానికి గౌరవ సూచకంగా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ (MCH) ఇరాన్ కాన్సులేట్ ఉన్న రహదారికి అయతుల్లా రుహొల్లా ఖొమేనీ పేరు పెట్టింది. హైదరాబాద్‌లో ఏర్పాటైన మొదటి దౌత్యకార్యాలయాల్లో ఇరాన్ కూడా ఒకటి.
జీవీకే మాల్ ఎదురుగా ఉన్న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7నే ఇమామ్ ఖొమేనీ రోడ్ అని పిలుస్తారు. ఇది అధికారికంగా ప్రభుత్వం పెట్టిన పేరు. ఆ రోడ్‌లోనే ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఉంది. మొదటి సుప్రీం లీడర్ ముసావీ ఖొమేనీ మరణం తర్వాత ఆయన శిష్యుడు అలీ హుస్సేనీ ఖమేనీ ఇరాన్‌కు సుప్రీం లీడర్ అయ్యారు. తాజాగా ఇజ్రాయేల్-అమెరికా సంయుక్త దాడుల్లో ఆయన కూడా మరణించారు.






