- వివాహ రిజిస్ట్రేషన్లకు కొత్త నిబంధనలు!
New Rules for Marriage Registration | పెద్దలకు తెలియకుండా ప్రేమ వివాహాలు చేసుకునే వారికి గుజరాత్ ప్రభుత్వం కొత్త నిబంధనలు రూపొందించింది. పెళ్లి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పెను మార్పులు తీసుకురానుంది.
ఇకపై వివాహ నమోదులో ‘కుటుంబ సమ్మతి’కి పెద్దపీట వేస్తూ సరికొత్త నిబంధనలను ప్రతిపాదించింది. దీనిపై ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి హర్ష్ సంఘ్వీ కీలక ప్రకటన చేశారు. వధూవరులు తమ పెళ్లి గురించి తల్లిదండ్రులకు తెలుసా లేదా అనే విషయాన్ని రికార్డుల్లో స్పష్టం చేయాలి.
దరఖాస్తు చేసుకున్న 10 రోజుల్లోపు రిజిస్ట్రార్ కార్యాలయం నుండి తల్లిదండ్రులకు వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా సమాచారం వెళ్తుంది. దరఖాస్తు చేసుకున్న వెంటనే సర్టిఫికేట్ రాదు. పెళ్లి ఫోటోలు, సాక్షుల వివరాలు ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత 30 రోజుల నిరీక్షణ కాలం తప్పనిసరి.
ఆధార్ కార్డుల నుండి పెళ్లి పత్రిక వరకు అన్ని పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ప్రేమ పెళ్లిళ్లు, మతాంతర వివాహాల్లో జరిగే మోసాలను అరికట్టడానికి, కుటుంబ విలువలను కాపాడటానికే ఈ మార్పులు తెచ్చామని ప్రభుత్వం చెబుతోంది.
కాగా, ఇది వ్యక్తిగత స్వేచ్ఛకు విఘాతమని కొందరు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ప్రతిపాదనలపై 30 రోజుల పాటు ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.






