UP Wedding Incident | యూపీ (Uttar Pradesh)లోని చందౌలీ (Chandouli) జిల్లా హమీద్పూర్ అనే గ్రామంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. వరుడి బంధువులకు రోటీలు ఆలస్యంగా వడ్డించడంతో గొడవ జరిగి చివరికి వధువు మారిపోయింది.
వివరాల్లోకి వెళితే.. డిసెంబర్ 22 న మెహతాబ్ అనే వరుడు హమీద్ పూర్ లోని వధువు ఇంటి వద్ద పెళ్లి మండపానికి చేరుకున్నారు. వరుడి బంధువులకు పెళ్లిలో భోజనానికి ఏర్పాట్లు చేశారు.
అయితే వారికి రోటీలు ఆలస్యంగా వడ్డించారు. దీంతో వరుడి తరఫు కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ చిన్న గొడవ మొదలై చివరికి పెళ్లి ఆగిపోయింది.
పెళ్లి కుమారుడు మెహతాబ్ అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత అదే రాత్రి మరో అమ్మాయిని చూసి వివాహం చేసుకున్నాడు.
అయితే ఇక ఈ విషయం పెళ్లి ఆగిపోయిన వధువు బంధువులకు తెలియడంతో వారు పోలీస్ స్టేషన్కు వెళ్లి జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. ఆ పెళ్లి కోసం తాము రూ.7 లక్షలు ఖర్చు చేశామని.. వీటితోపాటు వరుడికి కట్నంగా రూ.1.5 లక్షలు ఇచ్చినట్లు తెలిపారు.
తమ కుమార్తెను పెళ్లి చేసుకుంటానని చెప్పి.. మధ్యలో వదిలేసి మరో మహిళను పెళ్లి చేసుకున్న వరుడు మెహతాబ్, అతడి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరినట్లు వధువు కుటుంబ సభ్యులు తెలిపారు.










