Govt to replace GHMC Act with Core Urban Act | ఓఆర్ఆర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లకు వర్తించేలా జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కొత్త కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనుమతులు, రుసుములు, అభివృద్ధి పనులన్నీ ఆ చట్టం ఆధారంగా ఉండాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యం, రోడ్ల నాణ్యత, వీధి దీపాల మానిటరింగ్, ఫుడ్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీపై ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఆర్ & బీ తదితర విభాగాల పరిధిలోని రోడ్లన్నీ ఎంఏయూడీ పరిధిలోకి తేవాలని సూచించారు.
ఫ్యూచర్ సిటీలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, చెరువులు–కుంటల అభివృద్ధి, సుందరీకరణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు.










