Fact Check: Will ATMs Be Closed For 3 Days Due To Ind-Pak Tensions? Fact Check | తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు చెందిన ఏటీఎంలు మూసివేయబడుతున్నాయని ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.
తాజగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వైరల్ గా మారిన ప్రచారంపై స్పందించింది. ఇది పూర్తిగా ఫేక్ ప్రచారమని స్పష్టం చేసింది. కాగా పాకిస్థాన్ లో తలదాచుకుంటున్న ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ ను చేపట్టాయి.
ఈ ఆపరేషన్ ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో భారత సరిహద్దు వెంట ఉన్న నగరాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ సుమారు 300-400 డ్రోన్లతో దాడికి యత్నించింది. అయితే భారత సైన్యం డ్రోన్లను కూల్చివేసింది. ఈ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని కథనాలు వస్తున్నాయి.
ఇదే సమయంలో ఫేక్ న్యూస్ లు విపరీతంగా ప్రచారం అవుతున్నాయి. ఇందులో భాగంగా యుద్ధ భయాల వేళ ఏటీఏంలు మూసివేస్తున్నారని ప్రచారం జరిగింది. ర్యాన్సమ్ వేర్ సైబర్ దాడి జరగొచ్చని అందుకే రెండు-మూడు రోజుల పాటు ఏటీఏంలు మూసివేస్తున్నట్లు సదరు ప్రచారంలో పేర్కొనబడింది.
దీనిపై పీఐబీ ఫాక్ట్ చెక్ చేసింది. అది ఫేక్ వార్త అని, ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని పేర్కొంది. ఎప్పటిలాగే ఏటీఏంలు పని చేస్తాయని స్పష్టం చేసింది.










