Legal Notice To KCR | తెలంగాణలో ఫిబ్రవరి 4న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగనుంది. రాష్ట్రంలో చేపట్టిన కుల గణన, షెడ్యూల్డ్ కుల (SC) వర్గీకరణ అంశాలపై చర్చించడానికి మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించి అనంతరం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరుగనుంది.
కులగణన నివేదికలను ఉభయ సభలలో ప్రవేశపెడతారు. అనంతరం వాటిపై చర్చలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు లీగల్ నోటీసులు వచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పెద్దగా అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు.
దీంతో.. కేసీఆర్‌కు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ సోమవారం లీగల్ నోటీసులు పంపింది. అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని అసోసియేషన్ జనరల్ సెక్రటరీ విజయ్‌పాల్ కోరారు.
అసెంబ్లీలో అపోజిషన్ లీడర్‌గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించని మాజీ సీఎం కేసీఆర్‌కు సభలో సభ్యునిగా కొనసాగే అర్హత లేదని నోటీసులో పేర్కొన్నారు.
ప్రజా సమస్యలపై అసెంబ్లీలో కేసీఆర్ పోరాటం చేయాలని.. లేదంటే అసెంబ్లీకి హాజరుకాని కేసీఆర్‌ను వెంటనే ప్రధాన ప్రతిపక్ష నేత పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్‌కు స్పీకర్ సమన్లు జారీ చేసి వివరణ కోరాలని విజయ్ పాల్ విజ్ఞప్తి చేశారు.