Deputy Cm Pawan Kalyan News | తమ స్వగ్రామానికి రోడ్డు కావాలని కానిస్టేబుల్ ఉద్యోగానికి నూతనంగా ఎంపికైన అభ్యర్థి ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఈ బాధ్యతను అప్పగించారు సీఎం. సభ ప్రారంభంలో రోడ్డు కోరగా సభ ముగిసే లోపలే రోడ్డును మంజూరు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
మంగళగిరి వేదికగా మంగళవారం కానిస్టేబుల్ ఉద్యోగాలకు నూతనంగా ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం వెలుగురాతిబండ గ్రామానికి చెందిన లకే బాబూరావు కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామక పత్రం అందుకున్న తర్వాత మాట్లాడుతూ..తన సక్సెస్ స్టోరీని వివరించారు. అనంతరం తమ స్వగ్రామానికి రోడ్డు లేదని రహదారి నిర్మించాలని సీఎంను కోరారు.
ఈ బాధ్యతను డిప్యూటీ సీఎం శాఖ పరిధిలోకి వస్తుంది కనుక ఈ బాధ్యతను పవన్ కు అప్పగించారు సీఎం. ఈ నేపథ్యంలో పవన్ ఆదేశాల మేరకు అధికారులు తక్షణమే స్పందించి అంచనా రూపొందించారు. అనంతరం క్షణాల వ్యవధిలోనే తెమ్ములబండ నుంచి వెలుగురాతిబండ వరకు రోడ్డు నిర్మాణానికి రూ.3.90 కోట్లు మంజూరు చేశారు అల్లూరి జిల్లా కలెక్టర్. సభ ముగిసే లోపే రోడ్డు మంజూరు చేసేలా చర్యలు తీసుకున్నారు పవన్.









