Defence Minister Rajnath Singh About Operation Sindoor | భారత త్రివిధ దళాల పరాక్రమంతో పాకిస్థాన్ కాళ్ళ బేరానికి వచ్చిందని పేర్కొన్నారు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్.
సోమవారం లోకసభలో ‘ఆపరేషన్ సింధూర్’ పై జరిగిన చర్చ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడి, ఆపరేషన్ సింధూర్ వివరాలను వెల్లడించారు. పహల్గాంలో ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ పర్యాటకుల్ని కాల్చి చంపారని గుర్తుచేశారు.
అనంతరం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో వందకి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు చెప్పారు. కేవలం 22 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ పూర్తి అయ్యిందన్నారు. పాకిస్థాన్ లోని సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కేవలం ఉగ్రస్థావరాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.
సింధూర్ అనేది శౌర్యానికి, వీరత్వానికి ప్రతీక అని, ఈ ఆపరేషన్ చేపట్టిన భారత త్రివిధ దళాలకు ఈ సందర్భంగా కేంద్రమంత్రి అభినందనలు తెలియజేశారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్థాన్ దాడులకు పాల్పడిందని, వీటిని సైన్యం సమర్ధవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు.
ఆ తర్వాత మన సైన్యం మిస్సైళ్లతో దాయాధి దేశంపై విర్చుకుపడిన విషయాన్ని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ దేశం కాళ్ళ బేరానికి వచ్చిందన్నారు. భారత త్రివిధ దళాలను తట్టుకోలేక ఆ దేశ డీజీఎంవో వెంటనే ఫోన్ చేసినట్లు తెలిపారు.









