Cm Revanth Reddy News Latest | తెలంగాణలో రాబోయే పదేళ్లు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈ మేరకు శుక్రవారం గాంధీభవన్ లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం విజయం సాధించిందని పేర్కొన్నారు.
తాను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారని తెలిపారు. పార్టీ పదవులను క్యాజువల్ గా తీసుకోవద్దని ఈ సందర్భంగా సూచించారు. పార్టీ పదవులతోనే గుర్తింపు, గౌరవం లభిస్తుందన్నారు.
రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పెరగబోతున్నాయని, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, జమిలి ఎన్నికలు ప్రభావితం చేయబోతున్నాయని చెప్పారు. నూతన నాయకత్వానికి 2029 ఎన్నికలు వేదిక కావాలని పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాష్ట్రంలో మరో పదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.