Cm Revanth Reddy News | తెలంగాణకు చెందిన హరియాణ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని భారతీయ జనతా పార్టీని డిమాండ్ చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవలే ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా చేసిన విషయం తెల్సిందే.
దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఆయన రాజీనామా చేయడానికి గల కారణం తనకు తెలీదని, కానీ తదుపరి ఉప రాష్ట్రపతిగా తెలంగాణ వ్యక్తిని ఎన్నుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గతంలో తెలుగు వ్యక్తి అయిన వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అవుతారని చర్చ జరిగిందని, కానీ ఆయన్ను ఇంటికి పంపించి బీజేపీ తప్పు చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పటి తప్పును సరిదిద్దుకోవడానికి ఇప్పుడు బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి చేయాలని చెప్పారు.
తెలంగాణకు మరియు బీసీ నేతలకు బీజేపీ అన్యాయం చేస్తుందని సీఎం ఆరోపించారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నాయకుడిని తొలగించారని, అలాగే బీసీ అయిన దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని పేర్కొన్నారు. అందుకే తెలంగాణకు చెందిన బీసీ నేత దత్తాత్రేయను ఉపరాష్ట్రపతి చేయాలని తెలిపారు.










