CM Revanth Reddy News | హైదరాబాద్ లో గత కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రోడ్లు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో వరద నీరు వచ్చి చేరింది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ముంపు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి అమీర్పేట్ ప్రాంతంలో పర్యటించారు. మైత్రివనం, బల్కంపేటలో ముంపుకు గురైన బస్తీలను, డ్రైనేజీ వ్యవస్థలను పరిశీలించారు.
స్థానికుల్ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా సమస్యలకు పరిష్కారం చూపుతామని సీఎం హామీ ఇచ్చారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు పనులు చేపట్టాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం ఆరా తీశారు.
వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు.









