Cm Revanth In Osmania University | ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశిం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి విద్య అనే అమ్మాయితో ప్రేమలో పడ్డారని నవ్వులు పూయించారు. బుధవారం ముఖ్యమంత్రి ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు. ఆర్ట్స్ కాలేజి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉస్మానియా అభివృద్ధి కోసం రూ.1000 కోట్ల నిధులను మంజూరు చేస్తూ జారీ చేసిన జీవో ప్రతిని విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ కుమార్ కు అందజేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపాల్ కాశిం మాట్లాడారు. 1965లో నాటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ ఆర్ట్స్ కాలేజి మెట్లను ఎక్కారని దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో ఆర్ట్స్ కాలేజి మెట్లు ఎక్కిన తొలివ్యక్తి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. అలాగే సీఎం రేవంత్ సుమారు 30 ఏళ్ల క్రితం గీత అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నారని, కానీ మళ్లీ ఇప్పుడు మరో అమ్మాయితో ప్రేమలో పడ్డారని పేర్కొన్నారు. విద్య అనే అమ్మాయితో ముఖ్యమంత్రి ప్రేమలో పడ్డారని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. దింతో సీఎంతో సహా అక్కడున్నవారు చిరునవ్వు చిందించారు. విద్య గురించి సీఎం ప్రతీ ప్రసంగంలో మాట్లాడుతున్నారని చివరి వరకు ఈ ప్రేమను ఇలానే కొనసాగించాలని సీఎంను కాశిం కోరారు.









