CM Chandrababu News | ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ మేరకు స్వర్ణాంధ్ర-స్వచ్చంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల వరకు మాచర్లలో ప్రజాస్వామ్యం లేదని, అరాచకం రాజ్యమేలిందన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు కూడా జరగలేదని తెలిపారు. తాను గతంలో మాచర్లకు వద్దామంటే ఇంటి ముందు తాళ్ళు కట్టి రానీయకుండా చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు మాచర్లకు స్వాతంత్య్రం వచ్చిందన్నారు.
ప్రజల్లో సంతోషం కనిపిస్తుందని పేర్కొన్నారు. తాను 1995 నాటి ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. రాయలసీమలో ముఠా తగాదాలను అంతం చేశామని, పల్నాడులో జాగ్రత్తగా ఉండాలని, ప్రజలపై, వారి ఆస్తులపై దాడులు చేయొద్దని హెచ్చరించారు. పరిసరాల్లో చెత్తను తొలగించడంతో పాటు కొందరి మనస్థత్వాల్లో పేరుకుపోయిన చెత్తను సైతం తొలగించాల్సిన అవసరం ఉందని తెలిపారు.









