- 75 సెంట్ల భూమి.. 52 రకాల పంటలు..
- నెలకు రూ. 20 వేల ఆదాయం!
CM Chandrababu Praises Farmer | ప్రకృతి సాగులో అద్భుతాలు సృష్టిస్తున్న గుంటూరు జిల్లాకు చెందిన వృద్ధ రైతు రోశయ్యపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపించారు.
భూమిని తల్లిలా భావించి, రసాయనాలు లేని వ్యవసాయంతో ఆదర్శంగా నిలుస్తున్న రోశయ్య కృషిని కొనియాడుతూ సీఎం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఒక వీడియోను షేర్ చేశారు.
80 ఏళ్ల వయసులో అద్భుత ప్రయోగం
గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన రోశయ్యకు ప్రస్తుతం 80 ఏళ్లు. కేవలం 75 సెంట్ల భూమిలో ఏకంగా 52 రకాల పంటలను పండిస్తూ ఆయన అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు.
ప్రకృతి సేద్యం ద్వారా తక్కువ విస్తీర్ణంలోనే నెలకు రూ. 20 వేలకు పైగా ఆదాయం ఆర్జిస్తూ యువ రైతులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
2016 నాటి నిర్ణయమే ప్రేరణ
ఏపీ ప్రభుత్వం 2016లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి తీసుకున్న చర్యలతో ప్రేరణ పొంది రోశయ్య ఈ బాట పట్టారు. దీనిపై సీఎం స్పందిస్తూ.. “రోశయ్య విజయగాథ ఎంతో స్ఫూర్తిదాయకం.
ప్రకృతి సాగుపై మేము తీసుకున్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఇలాంటి సత్ఫలితాలను ఇవ్వడం సంతోషంగా ఉంది. రోశయ్య గారికి నా హృదయపూర్వక అభినందనలు” అని పేర్కొన్నారు.
రైతు సాధికార సంస్థ రూపొందించిన రోశయ్య విజయగాథ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తక్కువ పెట్టుబడితో, ఆరోగ్యకరమైన పంటలను పండిస్తూ రోశయ్య ప్రకృతి వ్యవసాయానికి బ్రాండ్ అంబాసిడర్‌గా మారారు.










