CM Chandrababu Aerial Survey | మొంథా తుఫాన్ కల్లోలం సృష్టించి వెళ్ళిపోయింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బుధవారం ఏరియల్ సర్వే చేశారు.
చిలకలూరిపేట, పర్చూరు, చీరాల, బాపట్ల, కోడూరు, నాగాయలంక, కాట్రేనికోన, అంబాజీపేట, రాయవరం, ముదినేపల్లిలో ఏరియల్ సర్వే చేసారు. అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడలరేవులో ముఖ్యమంత్రి నీట మునిగిన పంట పొలాలను పరిశీలిస్తారు. అంతకంటే ముందు ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం..గత నాలుగైదు రోజుల నుంచి మొంథా తుఫాన్ విషయంలో సమర్థవంతంగా వ్యవహరించి నష్టనివారణ చర్యలు చేపట్టినట్లు చెప్పారు.
సచివాలయం సిబ్బంది, జిల్లా అడ్మినిస్ట్రేషన్‌తో సహా అంతా కలిసి టీమ్ గా పనిచేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కష్టకాలంలో బాధితుల కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. మరో రెండు రోజులు ఇదే విధంగా పని చేస్తే… బాధిత ప్రజలకు మరింత ఊరట లభిస్తుందన్నారు. తుఫాన్ వెలిసింది కాబట్టి… వీలైనంత త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా అధికారులు పని చేయాలని సూచనలు చేశారు. మంత్రులు, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని స్పష్టం చేశారు. మొంథా తుఫాను వల్ల వివిధ విభాగాల్లో కలిగిన నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక అందివ్వాలని సూచించారు.









