Chevella Bus Accident | రంగారెడ్డి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర విషాదం చోటుచేసుకుంది. చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న లారీ ఢీకొట్టింది.
ఈ ఘోర ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. మరో 24 మందికి తీవ్రంగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన లారీ, బస్సుపై బోల్తా పడింది.
లారీలోని కంకర మొత్తం ప్రయాణికులపై పడటంతో చాలామంది ఆ కంకర కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల ఆర్తనాదాలతో ఘటనా స్థలం హృదయవిదారకంగా మారింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మూడు జేసీబీల సహాయంతో కంకరను తొలగించి, అందులో చిక్కుకున్న వారిని బయటకు తీస్తున్నారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.









