Konda Vishweshwar Reddy | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల (Chevella) పార్లమెంట్ బీజేపీ (BJP) అభ్యర్థిగా మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి (Konda Vishweshwar Reddy) సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అఫిడవిట్ లో కొండా ఆస్తులను చూసి సామాన్య ప్రజలు నోరెళ్ల బెట్టారు.
అఫిడవిట్ లో ఏకంగా రూ.4,490 కోట్ల ఆస్తులను చూపించారు విశ్వేశ్వర్ రెడ్డి. ఇందులో అపోలో హాస్పిటల్స్ (Apollo Hospitals) షేర్ల విలువే ఎక్కువ. కొండా పేరు మీద రూ.1,178 కోట్లు ఉండగా, ఆయన సతీమణి సంగీత రెడ్డి పేరిట రూ.3,203 కోట్లు ఉన్నట్లు తెలిపారు.
కుమారుడు వీరజ్ మాధవరెడ్డి పేరున కేవలం రూ.107 కోట్లే ఉన్నాయి. ఇక అప్పుల విషయానికి వస్తే కొండా పేరు మీద రూ.17.69 లక్షలు, ఆయన భార్య పేరు మీద రూ.12.06 కోట్లు ఉన్నాయి. అయితే ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్న కొండా పేరిట మాత్రం సొంత వాహనం లేదు.
అలాగే తన భార్య సంగీత రెడ్డి తనకు రూ. కోటి అప్పు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొన్నారు కొండా. 2019 లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ తో పోల్చితే కొండా విశ్వేశ్వర రెడ్డి ఆస్తులు ఏకంగా 400 శాతం పైనే పెరిగాయి.