KTR Pressmeet | ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ను కేటీఆర్ (KTR) రహస్యంగా కలిశాడంటూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
ఖమ్మంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నారా లోకేశ్ తనకు మంచి మిత్రుడు అని, ఆయనతో మంచి సంబంధాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాను లోకేశ్‌ను రహస్యంగా కలవలేదనీ, ఒకవేళ కలిసినా తప్పేమిటని ప్రశ్నించారు. “లోకేశ్ పక్క రాష్ట్ర మంత్రి, తమ్ముడి లాంటి వాడు. నేనేదో లోకేశ్‌ను అర్ధరాత్రి కలిశానట. నేను ఏం చేసినా బాజాప్తా చేస్తాను. అయినా లోకేశ్ నీలాగ ఏమైనా అంతర్రాష్ట్ర దొంగనా? లోకేశ్ ఏమైనా నీలాగా సంచులు మోసిన వ్యక్తా? లోకేశ్ నీలా చదువు రాని వాడు కాదు కదా. లోకేశ్ మీ పెద్ద బాస్ చంద్రబాబు కొడుకే కదా.. నేనేదో గూండానో, దావూద్ ఇబ్రహీంనో చీకట్లో కలిసినట్లు డైలాగ్‌లు ఏంది?” అంటూ మండిపడ్డారు కేటీఆర్.
పాలన గురించి తెలుసుకోవాలంటే బీఆర్ఎస్‌ను, దోపిడీ గురించి తెలుసుకోవాలంటే మాత్రం కాంగ్రెస్ వద్దకు రావాలని ఎద్దేవా చేశారు. తనపై టన్నుల కొద్దీ కేసులు పెట్టారని, చివరకి గుండు సూదంత ఆధారం కూడా చూపలేకపోయారని విమర్శించారు తనపై ఆరోపణలు చేస్తున్న వారికి ధైర్యం ఉంటే, ఆ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి చేస్తున్న నిరాధార వ్యాఖ్యల వల్ల యూట్యూబర్లకు తప్ప ఎవరికీ లాభం లేదని కేటీఆర్ అన్నారు.









