Arvind Kejriwal to enter Rajya Sabha? | దేశ రాజధాని ఢిల్లీ ముఖ్యమంత్రి గా మూడుసార్లు పనిచేసిన ఆప్ ( AAP ) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఇటీవల జరిగిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయం పాలైంది. న్యూ ఢిల్లీ స్థానం నుండి పోటీ చేసిన కేజ్రీవాల్ సైతం బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ ( Parvesh Verma ) చేతిలో ఓడిపోయారు. ఈ క్రమంలో మాజీ సీఎం అతిశీ ( Atishi ) ఢిల్లీ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యారు.
ఈ పరిణామాల నేపథ్యంలో అర్వింద్ కేజ్రీవాల్ ను పెద్దల సభకు పంపాలని ఆప్ యోచిస్తోంది. ప్రస్తుతం రాజ్యసభలో ఉన్న ఆప్ ఎంపీ సంజీవ్ అరోడా ( Sanjeev Arora )ను ఆప్ పంజాబ్ ఉపఎన్నికల బరిలో నిలిపింది. ఈ మేరకు లూథియానా వెస్ట్ అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక అభ్యర్థిగా ఆయన్ను ఆప్ ప్రకటించింది.
ఈ స్థానంలో ఎమ్మెల్యే గా ఉన్న ఆప్ నేత గుర్ ప్రీత్ గతనెలలో మరణించడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. సంజీవ్ అరోడాను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడంతో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళ్లనున్నట్లు కథనాలు వస్తున్నాయి.
2022లో పంజాబ్ నుండి సంజీవ్ అరోడా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2028 వరకు ఆయన పదవీ కాలం ఉంది. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తుండడంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖాళీ అవ్వబోయే ఈ స్థానం నుండి కేజ్రీవాల్ ను పెద్దల సభకు పంపాలని ఆప్ భావిస్తున్నట్లు సమాచారం.









